ఇన్ఫ్లేషన్ అనగా ఏమి ? దాని ప్రభావం మనపై ఏ విధం గా ఉంటుంది?  part -1
మీ చిన్నప్పుడు కొన్న వస్తువు ఏదైనా  సరే ఇప్పుడు కూడా అదే ధరకు లభ్యమవుతుందా ! లేదా  ఈ రోజు  కొన్న వస్తువు ఏదైనా సరే , భవిష్యత్తులో అదే ధరకు లభిస్తుంది అని నమ్ముతున్నారా ! లేదు కదా ! మీ చిన్న వయస్సులో కిలో పది రూపాయలు ఉన్న  బియ్యం ధర ఈ రోజు కిలో ముప్పై రూపాయల పైననే . మీరు ఏ వస్తువైన తీసుకోండి  మీ చిన్నప్పటికి , ఇప్పటికి ఎన్నో రెట్లు ధరలు పెరిగాయి.దీనికి ముఖ్య కారణం ద్రవ్యోల్బణం . దీనిని  ఎక్కువగా ఇన్ఫ్లేషన్ అని అంటారు.ఇన్ఫ్లేషన్ పెరగడం వలన  డబ్బు యొక్క విలువ తగ్గిపోవడంతో  మీకు తక్కువ వస్తువులు కాని సేవలు కాని లభ్యమవుతాయి. అదేవిధంగా ఈ ఇన్ఫ్లేషన్  మీ యొక్క సేవింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ పై చాలా ప్రమాదకర ప్రభావం చూపెడుతుంది. ఇన్ఫ్లేషన్ వలన ఒక వ్యక్తీ యొక్క కొనుగోలు సామర్ధ్యం తగ్గిపోతుంది. ఉదాహరణకు ఈ రోజు కిలో బియ్యం ఇరవై ఉంటే  అదే కిలో బియ్యం  సంవత్సరం తర్వాత ఇరవై ఐదు రూపాయలకు  లభిస్తుంది అంటే ధర ఇరవై ఐదు శాతం పెరిగినట్టు లేదా ఇన్ఫ్లేషన్ ఇరవై ఐదు శాతం నమోదు ఐనట్టు. మీరు మీ వద్ద గల వంద రూపాయలకు ఈ రోజు ఐదు కిలోలు కొనగలిగితే  సంవత్సరం తర్వాత మీరు కొనగలిగే  బియ్యం నాలుగు కిలోలే.అంటే ఇక్కడ ఏమి జరిగినది మీ వద్ద గల వంద రూపాయల కొనుగోలు శక్తి  తగ్గిపోయినట్టే కదా !  అదే విధంగా మీరు ఈ రోజు సేవింగ్ చేసిన లేక ఇన్వెస్ట్మెంట్ చేసిన వంద రూపాయల మీద కనుక రాబడి సంవత్సరానికి ఇరవై ఐదు శాతం పైన వస్తేనే మీకు నిజమైన రాబడి వచ్చినట్టు .ఎందుకంటె ఈ రోజు కొన్న ఐదు కిలోల బియ్యం  , సంవత్సరం తర్వాత కొనాలి అంటే నూట ఇరవై ఐదు రూపాయలు కావాలి కదా! ఇన్ఫ్లేషన్  లెక్కించడానికి అన్ని రకాల వస్తువులు మరియు సేవలను లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కేవలం ఉదాహరణ కొరకు మాత్రమే  బియ్యం తీసుకోవడం జరిగినది.   ఈ రోజు గల రూపాయి విలువ సంవత్సరం తర్వాత అదే విధంగా ఉండటం లేదు అంటే రూపాయి విలువ ప్రతి సంవత్సరం  తగ్గిపోతుంది .అదే విధంగా ఈ రోజు వంద రూపాయలు మీరు ఎవ్వరికైనా అప్పుగా ఇచ్చి సంవత్సరం తర్వాత కూడా వంద రూపాయలు తిరిగి పొందడం వలన లాభమా ! నష్టమా ! అంటే  మీకు నష్టమే .  ఇన్ఫ్లేషన్  కనుక పది శాతం  నమోదు అవుతుంటే  మీరు నూట పది రూపాయలు  తిరిగి పొందితేనే  మీకు ఎలాంటి నష్టం లేదు
ఈ రోజు  ఏదైనా ఉన్నత విద్య పూర్తీ చేయాలంటే కనీసం రెండు లక్షల రూపాయలు అవుతున్నాయి అనుకుంటే  ఈ రోజు   పది సంవత్సరాలు  వయస్సు ఉన్న మీ కూతురు మరో పది సంవత్సరాల తర్వాత ఇదే  ఉన్నత విద్య  పూర్తీ చేయుటకు అప్పుడు కూడా ఈ రెండు లక్షలే సరిపోతాయా ! మీ సమాధానం ఎట్టి పరిస్తుతులలో  కానే కాదు. ఇన్ఫ్లేషన్  కనుక ఎనిమిది శాతం నమోదు అవుతుంది అనుకుంటే కావలసిన మొత్తం రూ. 431785 . ఈ విధంగా పెరిగే ఖర్చులు తట్టుకోవాలి నాటే మంచి ఫైనాన్సియల్ ప్లానింగ్ ఏర్పాటు  చేసుకోవాలి.

స్టాక్ మార్కెట్లో చిన్న ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టడానికి అవకాశం కల్పించే రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్ స్కీమ్


స్టాక్ మార్కెట్లో చిన్న ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టడానికి అవకాశం కల్పించే రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్ స్కీమ్
RAJIV GANDHI EQUITY SAVINGS SCHEME (RGESS)

కేంద్ర ఆర్ధిక మంత్రి  కొత్త గా ఆదాయపు  పన్ను పథకాన్ని 21 sep 2012నాడు ఆమోదించడం జరిగినది. ఆ పథకం పేరే  రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్ స్కీమ్. ఈ పథకం ప్రకారం కొత్తగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే రిటైల్ ఇన్వెస్టర్లు ఆదాయపు పన్నుమినహాయింపు  పొందడానికి ఉపయోగపడుతుంది. వార్షిక ఆదాయం పది లక్షల లోపు ఉండి, తొలిసారిగా స్టాక్ మార్కెట్ లో యాభై వేలు ఇన్వెస్ట్ చేస్తారో  వారూ ఈ పథకం ద్వారా ఆదాయపు పన్ను మినహాయింపు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం దేశీయ స్టాక్ మార్కెట్ లో కి ఇన్వెస్టర్లను ఇన్వెస్ట్ చేయడానికి ప్రోత్సహించడం  , దేశంలో  ‘ఈక్విటీ సంస్కృతి' పెరిగేలా చూడటం.ఈ పథకం యొక్క ముఖ్యమైన లక్షణాలను ఒక్క సారి పరిశీలిద్దాం.

ఈ పథకం కొత్తగా మార్కెట్ లో కి ప్రవేశించే వారి కోసం ఉద్దేశించిన పథకం.వారిని వారి పాన్ నంబర్ ఆధారంగా గుర్తిస్తారు.ఎవరైనా ఇప్పటికే డిమ్యాట్ ఖాతా ప్రారంభించి ఎలాంటి లావాదేవీలు జరపకపోతే వారూ కూడా ఈ పథకం క్రింద ఇన్వెస్ట్ చేయవచ్చు.
పన్ను పరిధిలోకి వచ్చే వార్షిక ఆదాయం పది లక్షల కంటే తక్కువగా ఉంటుందో వారూ ఈ పథకం ద్వారా ఇన్వెస్ట్ చేయడానికి అర్హులు.

ఈ పథకం క్రింద గరిష్టంగా రూ 50,000 పెట్టుబడి పెట్టడానికి అవకాశం కలదు. ఇన్వెస్ట్ చేసిన మొత్తం లో    50% అమౌంట్ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుండి మినహాయింపు పొందుతారు.

ఈ పథకం క్రింద ఇన్వెస్ట్ చేయడానికి  BSE 100,  CNX100 లో ఉన్న కంపెనీలలో  , ప్రభుత్వ రంగసంస్థలలో   నవరత్న , మహానవరత్న, మినీ నవరత్న హోదా కలిగిన కంపెనీలు , పైన  పేర్కొనబడిన కంపెనీలలో ఫాలో అన్ పబ్లిక్ ఇష్యూ (   FPOs)లలో ,ప్రభుత్వరంగ కంపెనీలు  IPOకి వచ్చినప్పుడు ఆ ఆర్ధిక సంవత్సరం కంటే ముందు మూడు సంవత్సరాలు వరుసగా   4,000  కోట్ల కంటే అధిక టర్నోవర్ కలిగి ఉన్న కంపెనీలలో ఇన్వెస్ట్ చేయవచ్చు.అంటే ఏ కంపెనీలలో పడితే ఆ కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడం వలన ఈ పథకం యొక్క లాభాలు కలగవు.

వివిధ వర్గాల నుండి వచ్చిన అభ్యర్థన మేరకు   Exchange Traded Funds (ETFs) , Mutual Funds (MFs) ఈ పథకం క్రింద పేర్కొనబడిన కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తాయో వాటిని కూడా ఈ పథకం క్రింద పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.

చిన్న ఇన్వెస్టర్లకు , ప్రయోజనం కల్పించడానికి ఈ పథకంలో వాయిదా పద్దతిలో ఇన్వెస్ట్ చేయడానికి కూడా అవకాశం కలిపించడం జరిగినది.పన్ను ప్రయోజనాలు పొండుతున్న ఆర్ధిక సంవత్సరం లోనే ఇన్వెస్ట్ చేయాలి.

ఈ పథకం యొక్క లాక్ ఇన్ పిరియడ్ మూడు సంవత్సరములు. మీరు చివరిసారిగా ఇన్వెస్ట్ చేసిన తేది నుండి పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది..  

ఇన్వెస్ట్ చేసిన సంవత్సరం తరవాత  ఇన్వెస్ట్ చేసిన షేర్లలో ట్రేడింగ్ చేయడానికి అవకాశం కల్పించబడుతుంది.

మీరు ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఈ పథకంలో గల ఒక కంపెనీ  షేర్లు అమ్మినట్టు ఐతే మీరు అంతే విలువగల ఈ పథకంలో అనుమతి ఇవ్వబడిన మరో కంపెనీ షేర్లు కొనవలసి ఉంటుంది.

ఈ పథకం క్రింద ఆదాయపు పన్ను మినహాయింపు పొందడానికి   ఆదాయపు పన్ను సెక్షన్ 80CCG ను చేర్చడం జరిగినది.
కేంద్ర రెవిన్యూ డిపార్ట్ మెంట్ మరియు సెబీ రాబోవు రెండు వారాలలో  పూర్తీ వివరాలతో కూడిన సర్క్యులర్  ఇవ్వగలవు. 

గోల్డ్ మరియు సిల్వర్ లలో దేనిలో పెట్టుబడి పెడితే అధిక రాబడి ఉంటుంది.


గోల్డ్  మరియు సిల్వర్ లలో దేనిలో పెట్టుబడి పెడితే అధిక రాబడి ఉంటుంది.

2012  లో అధిక రాబడి అందించిన ఇన్వెస్ట్మెంట్ సాధనం ఏమిటో చెప్పగలరా ? ఆలోచిస్తున్నారా ?  బంగారం , షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ అని  అనుకుంటున్నారా ? ఎంత మాత్రం కాదు. 2012  లో అధిక రాబడి  వచ్చినది సిల్వర్ లో మాత్రమే .సిల్వర్ ఇప్పటి వరకు 2012  లో 25.61% CAGR రిటర్న్ అందివ్వడం జరిగినది.1 jan 2012 రోజు సిల్వర్ రేటు  రూ   51043 kg  ఉంటే  ఇప్పుడు  20 sep 2012రోజు రూ  64116kg  రేటుకి పెరగడం జరిగినది.అంటే కేవలం  9 నెలలలో నమ్మశక్యం కాని విధంగా 25.61% రాబడి ఇవ్వడం జరిగినది. సిల్వర్ లో తొమ్మిది నెలల రాబడి చూసి మోసపోకండి పూర్తీగా చదవండి. సిల్వర్ లో స్మవత్సరం వారీగా రాబడి చూసుకుంటే  రాబడి సున్నా మాత్రమే. గత సంవత్సరం  sep 2011 లో కూడా సిల్వర్ ధర   64353 kg ఉండటం జరిగినది.
బంగారం పరిశీలిస్తే 2012  లో 16.63% CAGR రిటర్న్ అందివ్వడం జరిగినది. 1 jan 2012 నాడు రూ  27322 - 10gm  ఉంటే  20 sep 2012రోజున   31865-10gm ధర  ఉండటం జరిగినది.అంటే కేవలం తొమ్మిది నెలలలో 16.63% రాబడి అందించడం జరిగినది.
ఇన్వెస్టర్లలో బంగారం లో ఇన్వెస్ట్ చేయడమా ? లేక సిల్వర్ లో చేయడం  మంచిదా ? దేనిలో రాబడి అధికంగా ఉంటుంది అని సందేహం ఎప్పటి   నుండో ఉంది . ఒకసారి మనం ఈ అనుమానం తీర్చుకొనే ప్రయత్నం చేద్దాం.


మన దేశంలో బంగారం పై మక్కువ ప్రతి ఒక్కరికి ఉంది .ఇక స్త్రీలకయితే చెప్పవలసిన పని లేదు. ప్రతి శుభ సమయంలో స్త్రీలు ధరించేది అధికంగా బంగారు ఆభరణాలనే .అదే సిల్వర్ దగ్గరికి వచ్చేసరికి కొద్ది మందికి మాత్రమే  ఇష్టం ఉంటుంది. అది కూడా ఎవరికి అయితే బంగారం ధర భరించడం కష్టంగా ఉంటుందో వారికి. ఇన్వెస్ట్మెంట్ దగ్గరికి వచ్చే సరికి సిల్వర్ . ప్లాటినం కంటే బంగారం లో మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి అధికంగా ఇష్టపడతాం.అందువలనే బంగారం ఎక్కువగా వార్తలలో  ఉంటుంది.
చరిత్రని బట్టి చూస్తే బంగారంలో రాబడి గత దశాబ్దం నుండి స్థిరంగా ఉంది.కాని బంగారంతో పోలిస్తే సిల్వర్ లో రాబడి నమ్మశక్యంగాని విధంగా ఉంది.  2009 లో బంగారం  19.3% రాబడి అందిస్తే సిల్వర్   42.4 %  ,2010 లో బంగారం  22.3% రాబడి అందిస్తే సిల్వర్   70.60% అందించినది..క్రింద పట్టికలో గత దశాబ్దకాలంలో  బంగారం మరియు సిల్వర్ అందించిన రాబడి వివరాలు ఉన్నాయి.

పై పట్టికను చూసి దేనిలో ఇన్వెస్ట్ చేయాలో తెలియక తికమక పడుతున్నారా ? బంగారం తో పోలిస్తే  సిల్వర్  అధికంగా రాబడిని అందించినది వాస్తవమే అయినా  బంగారం స్థిరంగా రాబడి అందించినది. అదే సిల్వర్ లో  అధికంగా ఒడిదుడుకులు ఉన్నాయి.   సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే  అధిక రిస్కు తీసుకొనే వారికి మాత్రమే సూట్  అవుతుంది. సిల్వర్లో  అధికంగా స్పెక్యులేషన్ జరుగుతుంది. అంతే కాకుండా సిల్వర్ యొక్క ధరను అంచానా వేయడం కూడా చాలా కష్టం అవుతుంది. అదే  బంగారం ధరలో మార్పు స్థిరంగా ఉంటుంది అది కూడా పెరగడమే . ధర పడిపోయిన తక్కువ శాతం  మాత్రమే పడిపోతుంది. అంతే కాకుండా ఇన్ఫ్లేషన్ తట్టుకొనే శక్తి బంగారం కి మాత్రమే ఉంది.  అందువలన ఇన్వెస్ట్మెంట్ కొరకు బంగారం లేక సిల్వర్ అనే  ఆలోచన వచ్చినప్పుడు బంగారానికి మీ  ఓటు వేయండి.  సిల్వర్ అధికంగా రిస్కు తీసుకొనే వారికి మాత్రమే పనికి వస్తుంది.


స్టాక్ మార్కెట్ లో బుల్ రన్ ప్రారంభమైనట్టేనా ?


స్టాక్ మార్కెట్ లో బుల్ రన్ ప్రారంభమైనట్టేనా ?
బుల్ మార్కెటులో సాదారణంగా ప్రతి గుడ్ న్యూస్ మార్కెట్ పెరగడానికి తోడ్పాటు అందిస్తే  , ప్రతి బ్యాడ్ న్యూస్ మార్కెట్ లో చిన్న చిన్న కరేక్షన్స్ రావడానికి సహాయపడతాయి. మమతాబెనర్జీ  UPA ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించినప్పుడు నిఫ్టీ లో 50  పాయింట్ల కరెక్షన్ వస్తే , ఎప్పుడయితే మూలాయం సింగ్ యాదవ్   UPA ప్రభుత్వానికి మద్దతు తెలియచేయడంతో  నిఫ్టీ 2012 లోనే అత్యధిక పాయింట్ల ర్యాలీ చేయడం జరిగినది. కేవలం పన్నెండు రోజుల ట్రేడింగ్ సెషన్స్ లో 502 పాయింట్ల ర్యాలీ నిఫ్టీ లో జరిగినది.  అంతే కాకుండా మార్కెట్ 14 నెలల గరిష్ట  స్థాయిల వద్ద ఉంది. దీనికి ముఖ్య కారణం UPA ప్రభుత్వం సంస్కరణల బాట పట్టడంతో మార్కట్ సానుకూలంగా స్పందిస్తుంది. అంత మాత్రాన దేశ ఆర్ధిక వ్యవస్థ బాగున్నట్టు కాదు. ఇంకా ఇన్ఫ్లేషన్ అధిక స్థాయిల వద్దనే ఉంది. యూరోప్ మరియు అమెరికా ఆర్ధిక వ్యవస్థ ఇంకా ప్రశ్నార్థకంగానే  ఉంది. అక్కడి నుండి వచ్చే ఎలాంటి నెగిటివ్ న్యూస్ అయిన మార్కెట్ పై తప్పకుండా ప్రభావం చూపెడతాయి. నిఫ్టీ ప్రస్తుత ర్యాలీ మరియు వీక్లీ క్లోజ్ ను బట్టి చూస్తే ర్యాలీ మరింత కొనసాగి బుల్ రన్ లో ప్రవేశించవచ్చు. ఒకవేళ బుల్ రన్ నిర్ధారణ జరిగినట్టు ఐతే  తెలియచేస్తాం. ఎవరైనా సరే మార్కెట్ లో ఎప్పుడూ కూడా మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా వెళ్ళాలి. అంతే కాని ట్రెండ్ కి వ్యతిరేక దిశలో వెళ్తే మీ కాపిటల్ మొత్తం నష్టపోతారు. అప్పుడు మీరు ఏమి చేయలేరు.గత పక్షం రోజుల  నుండి ఎవ్వరయితే  ట్రెండ్ కి వ్యతిరేకంగా వెళ్ళారో వారూ అధికంగా నష్టపోవడం జరిగినది. మేము  మాత్రం ఖచ్చితమైన  అనాలసిస్ తో మార్కెట్ ర్యాలీ అంచనా వేయడం జరిగినది. మీకు ఏ విధమైన అనుమానాలు ఉన్న పాత పోస్టులు ఒక్కసారి చదవండి.  
 మీకు గత వారం నుండి తెలియచేయడం జరిగినది. నిఫ్టీ 5648 పైన నిలదోక్కుకున్నట్టు ఐతే ర్యాలీ వస్తుంది అని తెలియచేయడం జరిగినది.అనుకున్నట్టుగానే  5648 పైన నిఫ్టీ  నిమిషాల వ్యవధి లోనే 5720 వరకు చేరుకోవడం జరిగినది.



ఇక ఈ వారానికి వస్తే  ఇక్కడి నుండి కనీసం ఇంకా  నిఫ్టీ 150-200 పాయింట్ల వరకు ర్యాలీ జరగడానికి అవకాశం కలదు.  నిఫ్టీ  5700, 5648 పైన  ఉన్నంత వరకు  లాంగ్ పొజిషన్స్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. నిఫ్టీ కి రెసిస్టన్స్  5750, 5810, 5850, 5958   , సపోర్ట్ 5648 , 5580 , వద్ద కలదు. ఈ వారంలో డేరివేటివ్స్ ఎక్స్ ఫైరీ ఉన్నందున జాగ్రత్త వహించడం  మంచిది.  స్టాక్ మార్కెట్ లో మీరు సక్సెస్ కావాలి అంటే స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ లో అవగాహన తప్పనిసరి. ఈ మధ్య చాలా మంది ప్రతి రోజు మార్కెట్ అప్ డేట్స్ ఇవవంది. ఫ్రీ టిప్స్ ఇవ్వండి అని అడగడం జరుగుతుంది.   మేము ప్రతి  సోమవారం  తెలియచేసే నిఫ్టీ అనాలసిస్ ఆ వారానికి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఏమైనా మార్పులు , చేర్పులు ఉంటే తప్పకుండా తెలియచేస్తాం. ఇక ఫ్రీ టిప్స్ అడిగేవారికి మాది ఒక్కటే మనవి. మా ప్రయత్నం అంత టిప్స్ కోసం మీరు ఇతరుల పై  ఆధారపడకుండా స్వయంగా మార్కెట్ పై  పూర్తీ అవగాహాన పెంచుకొని మీ కాళ్ళపై మీరు మార్కెట్ లో నిలబడాలి అని. మీము ప్రీ టిప్స్ కి పూర్తీ గా వ్యతిరేకం . మీరు మార్కెట్ గురుంచి నేర్చుకొనే సమయంలో ఏమైనా అనుమానాలు ఉంటే వాటిని నిసందేహంగా తీరుస్తాం.  అంతే కాని మా వద్ద నుండి ఫ్రీ టిప్స్ మాత్రం  ఆశించకండి. ఈ బ్లాగ్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు మార్కెట్ పై మా విశ్లేషణ , నిఫ్టీ అనాలసిస్ ఇంత వరకు తప్పలేదు అనే విషయం మీరు రెగ్యులర్ గా మా బ్లాగ్ చదివితే మీకే  ఈ పాటికి అర్ధం అయ్యి ఉంటుంది.
ముఖ్య గమనిక :మీరు  స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి  ఎంచుకొని దానినే స్థిరంగా  మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్ మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం అవుతుంది.


షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు అందరూ చూసే వార్షిక నివేదిక లేదా అన్యూవల్ రిపోర్ట్ అనగా ఏమి ?


షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు అందరూ చూసే వార్షిక నివేదిక లేదా అన్యూవల్ రిపోర్ట్  అనగా ఏమి ?
వార్షిక నివేదిక లేదా అన్యూవల్ రిపోర్ట్  అనగా ఒక ఆర్ధిక సంవత్సరంలో  ఏదేని కంపెనీ  లేదా వ్యాపారం యొక్క  ఆదాయం, ఖర్చులు, ఆ  ఆర్ధిక సంవత్సరంలో  జరిగిన కొత్త ఒప్పందాలు , చేరుకున్న మైలు రాళ్ళు ,మేనేజ్మెంట్ లో మార్పులు చేర్పులు, ముఖ్యమైన సిబ్బంది మార్పులు చేర్పులు, భవిష్యత్తు ప్రణాళికలు  మొదలగునవి పొందుపర్చినటువంటి  నివేదిక . ఈ నివేదికను మేనేజ్మెంట్  రూపొందించి దానిని  షేర్  హోల్డర్స్, అంటే వాటా దారులకు, ప్రమోటర్లకు , వివిధ ప్రభుత్వ  విభాగాలకు , సెబీ కి,  అందచేస్తుంది.సాదారణ ప్రజానీకానికి మరియు  ఆ కంపెనీ లేదా వ్యాపారం పై ఆసక్తి ఉన్న వారందరికి అందుబాటులో ఉంటుంది. సాదారణంగా వార్షిక  నివేదిక ను   పుస్తక రూపంలో రూపొందిస్తారు. దానిలో చైర్మన్ సందేశం మొదలుకొని  భవిష్యత్తు  ప్రణాళికలు  ఉంటాయి.

సాధారణంగా వార్షిక నివేదిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నుండి వాటాదారులకు ఒక లేఖ అన్నమాట. దీనిలో  అందరూ  బోర్డు సభ్యులు, ఆడిటర్లు, సెక్రటరీ  మొదలగు వారీ  యొక్క ఫోన్  నంబర్లు ఒక జాబితా రూపంలో ఉంటాయి.తదుపరి పేజీలలో  బ్యాలెన్స్ షీట్ వంటి వివరణాత్మక ఆర్థిక నివేదికలు, ఆదాయ ప్రకటన, సహాయక షెడ్యూళ్లు సంస్థ కార్యకలాపాల మీద ఒక సాధారణ నివేదిక, ఒక స్వతంత్ర ఆడిటర్ యొక్క నివేదిక మొదలగునవి పొందుపరుస్తారు. అంతే కాకుండా కంపెనీ లో వివిధ వర్గాల వాటా ఏ విధంగా ఉంది మొదలగు వివరాలు ఉంటాయి. అంటే కంపెనీలో ఎవరేవ్వరికి ఎంత భాగస్వామ్య వాటా ఉంది అనే వివరాలు. కంపెనీ యొక్క షేరు ధర చరిత్ర మొత్తం అంటే షేరు యొక్క గరిష్ట , కనిష్ట ధరల వివరాలు ఉంటాయి. సంస్థ సాధించిన అన్ని మైలురాళ్ళు మరియు విజయాలు వివరిస్తూ చిత్రాలు మరియు గ్రాఫ్లు మొదలగునవి కూడా ఉంటాయి.
సాధారణంగా ఒక వార్షిక నివేదికలో  వ్యాపార అనుకూల అంశాలు ద్విగుణీకృతం చేస్తూ అంటే గొప్పగా చెప్తూ , ప్రతికూల అంశాలపై   తక్కువ శ్రద్ధ చూపెడతాయి.కాబట్టి,  మీరు చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా వార్షిక  నివేదికను చదవ వలసి ఉంటుంది. చైర్మన్ తన సందేశంలో పరోక్షంగా లక్ష్యాలు సాధించలేనందుకు  క్షమాపణలు కూడా చెప్పి ఉండవచ్చు. మీరు  గతంలో చెప్పిన భవిష్యత్ ప్రణాళికలు సాధించారా లేదా అని తెలుసుకోవడానికి గత ఆర్ధిక సంవత్సర వార్షిక నివేదికతో పోల్చి చూస్తే లక్ష్యాలు చేరుకున్నది లేనిది సులభంగా తెలిసిపోతుంది.  పూర్తిగా ఒక వార్షిక నివేదికను  చదివి అర్థం చేసుకోవాలి అంటే కొంత  నైపుణ్యం మరియు సహనం అవసరం అవుతుంది. మీరు  ఒక కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీరు ఆ వార్షిక నివేదిక ద్వారా ఆ సంస్థ యొక్క కార్యకలాపాలను మరింత  లోతుగా అర్ధం చేసుకోవడానికి సహాయ పడుతుంది.మీరు వార్షిక నివేదిక ద్వారా  క్రింది విషయాలపై ఒక అవగాహన కు రాగలుగుతారు.
Letter from the CEO
Summary of the operations-milestones, achievements, prospects.
Past Annual summary of all financial figures.
Management discussion and analysis of the performance of the company
The balance sheet
The income statement
Auditor’s report
Subsidiaries, brands, addresses, registered office, head quarters etc..
Names of directors
Stock price history
తదుపరి ఆర్టికల్ లో   వార్షిక నివేదిక లేదా అన్యూవల్ రిపోర్ట్  ఏ విధంగా చదవాలో తెలుసుకుందాం.

బంగారం లో పెట్టుబడి పెడుతున్నప్పుడు ఏ గోల్డ్ ETF లో పెట్టుబడి పెట్టడం మంచిది?


బంగారం లో పెట్టుబడి పెడుతున్నప్పుడు  ఏ గోల్డ్  ETF లో పెట్టుబడి పెట్టడం మంచిది?
ఇది వరకు నేను బంగారంపై  వ్రాసిన ఆర్టికల్స్ చదివిన తర్వాత కొంత మంది మిత్రులు బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి వివిధ గోల్డ్  ETF లు అందుబాటులో ఉన్నాయి కదా ? అందులో వేటిలో  ఇన్వెస్ట్ చేస్తే మంచిది ? వాటి రాబడి  ఏ విధంగా ఉంది ? అని అడగడం జరిగినది. ఇప్పుడు వాటి గురుంచి ఒక్కసారి వివవరంగా తెలుసుకుందాం. గోల్డ్  ETF కనుగోలు చేస్తున్నాం అంటే బంగారాన్ని  ఎలక్ట్రానిక్  రూపంలో కనుగోలు చేయడం . గోల్డ్  ETFలు అందుబాటులోకి వచ్చాక బంగారంలో ఇన్వెస్ట్ చేయడం చాలా సులభతరం అయింది. గోల్డ్  ETF లో రాబడి సాదారణంగా ఫిజికల్ గోల్డ్ ధరపై ఆధారపడిఉంటుంది.ఒక గోల్డ్ ETF సుమారు ఒక గ్రాం బంగారం తో సమానం. గోల్డ్  ETF లో ఇన్వెస్ట్ చేయడం చాలా సులభం . అంతేకాకుండా మీరు ఒక గ్రాం బంగారం కూడా కనుగోలు చేయవచ్చు. దాని వల్ల మీరు  కొంత కాలంలో మీకు  కావలసిన  బంగారం జమ అయ్యే వరకు ప్రతినెల  ఇన్వెస్ట్ చేయవచ్చు.వివిధ రకాల గోల్డ్ ETF ల రిటర్న్స్ ఏ విధంగా ఉన్నాయో క్రింది పట్టిక ద్వారా చూడండి.

S.No

ETF  Name


% of Returns For 1 Year
1
Axis
12.82
2
Birla sun life
13.15
3
Gs gold bees
12.98
4
HDFC
13.04
5
ICICI-pru
12.86
6
Kotak

12.99
7
Quantam
13.03
8
Reliance

13.08
9
Religare

13.12
10
Sbi
13.19
11
Uti

13.04
12
Physical gold

14.88
మీరు పై పట్టికను పరిశీలిస్తే వివిధ రకాల గోల్డ్ ETF లో రాబడిలో తేడా చాలా స్వల్పలంగా  ఉంది. దాదాపు గా అన్ని గోల్డ్ ETF లు ఒకే రకమైన రాబడి అందచేసాయి. రాబడిలో స్వల్ప తేడా కూడా నిర్వహణపరమైన ఖర్చుల వలన సంభవించినదే. అందువలన ఏ గోల్డ్ ETF లో  అయిన ఇన్వెస్ట్ చేయవచ్చు.కాకపోతే ఇప్పుడూ కూడా బంగారంలో ఇన్వెస్ట్ చేయవవచ్చా ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అనడంలో ఎలాంటి సందేహం లేదు.  దాని గురుంచి బంగారంలో ఇప్పుడు పెట్టుబడి పెడితే రానున్న మూడేళ్లలో రెట్టింపు కావడం నిజమేనా ?  అనే  ఆర్టికల్ వివరంగా చదవండి.


జీవితంలో డబ్బు సంపాదించాలి ? ఆర్ధికంగా ఎదాగాలి అంటే ఆర్ధిక అక్షరాస్యత తప్పనిసరా ?


జీవితంలో డబ్బు సంపాదించాలి ? ఆర్ధికంగా ఎదాగాలి అంటే ఆర్ధిక అక్షరాస్యత తప్పనిసరా ?
 ప్రతి మనిషికి ఆర్దిక అక్షరాస్యత అనేది చాలా అవసరమే కాకుండా అతి ముఖ్యం కూడా . ఈ రోజుల్లో కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోతే ఏ విధంగా చదువు రాని వారి క్రింద జమకడతారో   మీ అందరికి తెలుసు.  అదే విధంగా మీకు ఆర్ధిక అక్షరాస్యత లేకపోతే , వ్యక్తిగత ఫైనాన్స్ పై అవగాహన లేకపోతే  మీకు ఎన్ని ఉన్నత డిగ్రీలు ఉన్న, మీ రంగంలో మీరు ఎంత గొప్ప వారైనా  అర్దిక అక్షరాస్యత లేకపోతే  మీ జీవితచరమాంకం లోపు ఎప్పుడో ఒకప్పుడు ఇబ్బంది పడక తప్పదు. ఆర్దిక అక్షరాస్యత లేకపోవడం వలన కోట్లు సంపాదించిన వారూ కూడా బికారులు అయిన వారూ ఎంతో మంది ఉన్నారు. చాలా మంది అనుకుంటారు మేము చాలా పెద్ద సాలరీ అందుకుంటూన్నాం , మాకు ఆర్ధిక అక్షరాస్యత అవసరమా అని? ముఖ్యంగా సాప్ట్ వేర్  ప్రోపెషనల్స్ . అలా అనుకోవడం చాలా పెద్ద తప్పు మీరు ఏ రంగం లో ఉన్నా సరే.

దయచేసి ఒక విషయం తప్పక గుర్తుపెట్టుకోండి. డబ్బు సంపాదించడానికి , డబ్బు  మేనేజ్మెంట్ చేయడానికి చాలా తేడా ఉంది. రెండు వేరు వేరు భిన్న ద్రువాలు.మీరు ఎటువంటి వృత్తిలో ఉన్నా సరే  ఆర్దిక అక్షరాస్యత అనేది తప్పనిసరి. మీరు ఎంత కాలం ఇంకా మీ వ్యక్తిగత ఆర్ధిక నిర్ణయాల కొరకు   ఫ్రెండ్స్, బ్రోకర్స్, టి .వి అనలిస్ట్ లు  మొదలగు వారిపై ఆధారపడతారు.  మీరు మిలియనీర్లు ,బిలియనీర్లు కావడం అనేది మీ అర్దిక అక్షరాస్యత పై ఆధారపడి ఉంటుంది. మీరు ధనవంతులు కావడం అనేది మీరు  తీసుకునే అర్దిక పరమైన నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ఆర్దిక అక్షరాస్యత అంటే ఎంతో కష్టమైన స్టాక్ మార్కెట్  డేరివేటివ్స్  విశ్లేషణ , కరెన్సీ మార్కెట్ విశ్లేషణ కాదు. మీ వ్యక్తిగత ఫైనాన్స్ ప్లానింగ్ సరిగ్గా నిర్వహించడం.  ఆర్దిక అక్షరాస్యత పేద వారూ , డబ్బు ఉన్నవారూ  అని తేడా లేదు అందరికి కావలసినదే. చివరకు వంశపారంపర్యంగా  సంపద వారసత్వంగా వచ్చిన వారికి కూడా తప్పనిసరిగా కావలసినదే. ఎందుకంటె  వారసత్వంగా వచ్చిన  సంపదను నిలుపుకోవాలి అంటే కూడా ఆర్దిక అక్షరాస్యత కావాలి. ఆర్దిక అక్షరాస్యత అంటే మీ ఖర్చులను నియంత్రించుకోవడం , ఆస్తులు మరియు అప్పులకు మధ్య తేడా తెలుసుకోవడం, ఆస్తులను ఏవిధంగా పెంచుకోవాలో తెలుసుకోవడం , ఆర్ధిక పరంగా ముఖ్యమైన నిర్ణయాలను సమర్ధవంతంగా  తీసుకోగలగడం , మీరు సంపాదించిన సంపదను ,సంపద  స్ప్రుస్టించే సాధనలాలో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోవడం. సంపాదించిన సంపదపై ఆదాయపు పన్ను ఏవిధంగా   అదా చేయాలో తెలుసుకోవడం.
మీకు ఒక ఉదాహరణ చెప్తాను .మైక్ టైసన్ , మైఖేల్ జాక్షన్ మీ అందరికి తెలుసుకదా ? వారూ వారి రంగాలలో నెంబర్ వన్ గా ఉండటమే గాక ప్రపంచ వ్యాప్తంగా  కూడా  ఎంతో ప్రసిద్ది పొందడమే కాకుండా మిలియన్ల కొద్ది డబ్బు సంపాదించారు. కాని వారి ఆర్ధిక పరిస్థితి దారుణంగా దిగజారి దివాలా  తీసారు. దీనికి ముఖ్య కారణం వారికి   ఆర్దిక అక్షరాస్యత లేకపోవడమే. వారికి ఆర్దిక అక్షరాస్యత ఉంటే వారూ సంపాదించిన మిలియన్ల డబ్బు, బిలియన్లుగా మారేది. ఆర్దిక అక్షరాస్యత  ప్రతి ఒక్కరికి వయస్సుతో నిమిత్తం లేకుండా , చేస్తున్న వృత్తి , బిజినెస్ తో సంభందం లేకుండా ప్రతి ఒక్కరికి అవసరం. అమెరికాలోఒక   నివేదిక ప్రకారం bankruptcies 70 % మంది 25 సంవత్సరాలలోపు వారే . అదికూడా  80%  మంది వారి bankruptcies తెలియచేసిన ఒకే ఒక కారణం ఏమిటో తెలుసా ? క్రెడిట్ కార్డ్స్.పిల్లలు స్కూల్ వయస్సులో ఉన్నప్పుడే ఆర్ధిక అక్షరాస్యత మౌళిక  సూత్రాలు తెలుసుకొని ఉంటే వారూ కాలేజీలోకి  , యుక్త వయస్సులోకి వచ్చిన వెంటనే లేదా వారి సంపాదన మొదలైన కొత్తలో  అధిక , అనవసరమైన ఖర్చులు చేసేవారు కాదు.వారి సంపాదన మొదలు కాకముందే  వారికి మనీ మేనేజ్మెంట్ పై అవగాహన ఉంటే వారీ జీవితంలో డబ్బు కోసం అసలు ఇబ్బంది పడాల్సిన అవసరమే రాదు.  
పిల్లలు అధికంగా ఖర్చు చేసే చెడు  అలవాటు ఎక్కడి నుండి నేర్చు కొంటారో మీకు తెలుసా ? వారి స్నేహితుల నుండి అనుకుంటున్నారా ? తప్పు వారి  తల్లితండ్రుల నుండే నేర్చుకొంటారు. మీరు నమ్మండి , నమ్మకపొండి .ఇది ముమ్మాటికి వాస్తవం.పిల్లలు ఖరీదైన షాపింగ్ అలవాటు ,క్రెడిట్ కార్డ్ వాడకలు  వారి తల్లితండ్రుల నుండే నేర్చుకొని పెద్దయ్యాక వారి జీవితంలో ఒక భాగం చేసుకుంటారు.
దురదృష్టావశాత్తు  ప్రజలలో మరొక అపోహ కూడా ఉంది. వారి జీవితంలో అనుకోకుండా సంపద రావడం , సాలరీ లో భారీ పెరుగుదల ఉంటే వారి ఆర్ధిక అక్షరాస్యత పెరిగింది అనే అపోహలో  ఉండి ఆర్ధిక నిపుణుల అభిప్రాయం లేకుండానే ఆర్ధిక నిర్ణయాలు తీసుకోవడం వలన చివరకు ఆర్ధికంగా నష్టపోవడం తప్పా వారూ చేయగలిగేది ఏమి ఉండదు.ఎదిఎమైనప్పటికి జీవితంలో ఆర్ధికంగా ఎదగాలి , డబ్బూ సంపాదించాలి అంటే ప్రతి ఒక్కరికి ఆర్ధిక  అక్షరాస్యత అనేది తప్పనిసరి ముఖ్యంగా పిల్లలకు కూడా చిన్నప్పటినుండే  ఆర్ధిక  అక్షరాస్యత కల్పించాలి.ఇప్పటి 

సాప్ట్ వేర్  ఉద్యోగులలో అధిక శాతం ఎడా పెడా దొరికిన లోన్స్ , క్రెడిట్ కార్డ్స్ వాడేసి వచ్చే జీతం మొత్తం EMI లకు వెళ్ళడంతో కనీస సాలరీ కూడా సరిగా అందుకోలేని వాళ్ళను ఎంతో మందిని చూడటం జరిగినది. మీ పరిస్థితి, మీ పిల్లల పరిస్థితి  ఆ విధంగా జరగకుండా జాగ్రత్తపడండి.
telugufinancialschool@gmail.com